ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు
పోలీస్ స్టేషన్.. పోలీసులు అంటేనే.. ఒక రకమైన భయం.. చదువుకున్న వారు సైతం పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు ఇవ్వడానికి తటపటాయిస్తారు. నలుగురు పెద్ద మనుషుల సాయం లేనిదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వెనుక ముందుఅవుతారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన మూలంగా తాము గాని, తమ చుట్టూరా ఉన్నవారు గాని ఎవరైనా నష్టానికి, హానికి గురైనపుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం కనీస బాధ్యత.. అయితే అత్యవసరమైన ఈ విషయంపై చదువురాని వారికే కాదు.. విద్యావంతులకు సైతం సరైన అవగాహన ఉండదు. పోలీసులు, పోలీస్ స్టేషన్ అంటేనే మనసులో అంతర్లీనంగా ఉన్న భయం వల్ల కూడా చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సందేహిస్తుంటారు. ఎఫ్‌ఐఆర్ గురించి విపులంగా తెలిసి ఉంటే అవసరమైన సందర్భాల్లో అనవసరమైన భయాలు, అనుమానాలు లేకుండా మనకున్న రక్షణ హక్కులను వినియోగించుకోవచ్చు. ఎఫ్‌ఐఆర్‌పై ప్రత్యేక కథనం.
ఎఫ్‌ఐఆర్ అంటే ?
ప్రాథమిక సమాచార పత్రం (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్టు-ఎఫ్‌ఐఆర్) కాగ్నిజబుల్ అఫెన్స్ (ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకునే నేరం) కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రాసుకునే సమాచార పత్రం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు అందే మొదటి సమాచారం ఇదే.
కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే..?
కేసు తీవ్రతను బట్టి పోలీసులు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఇలాంటి కేసుల్లో పోలీసులు సొంతంగా పరిశోదన ప్రారంభించవచ్చు. ఉదాహరణకు హత్యాయత్నం, హత్య, ఇంటిని కూల్చివేయడం, దోపిడీలు, డెకాయిటీ, మోసం, ట్రేస్‌పాస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మొదలైనవి
ఎఫ్‌ఐఆర్ ఎక్కడ ఫైల్ చేయాలి..?
సంఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడే ఫిర్యాదు చేయాలి. ఒకవేళ మీకు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియక పోతే, అక్కడికి వెళ్లడానికి మీకు ఏదైనా సమస్యలు ఉంటే.. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలో ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత నమోదు చేసిన కేసు ఏ ప్రాంతంలో జరిగిందో కనుక్కొని ఆ ప్రాంత పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేసే బాధ్యత పోలీసులదే. ఇటీవల మీసేవలో సైతం పోలీస్ స్టేషన్‌లకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
ఎఫ్‌ఐఆర్ చేసే విధానం..
క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ నేర శిక్షాస్మృతి 1973లోని సెక్షన్ 154 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. మీరు మౌఖికంగా ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు తప్పని సరిగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏమి రాసుకున్నారో మీకు తప్పక చదివి వినిపించాల్సి ఉంటుంది. చదివి వినిపించమని అడిగే హక్కు మీకుంటుంది. అయితే చాలా సందర్భాల్లో పోలీసులు మాత్రం ఫిర్యాదు ఇవ్వండి..కేసు చేస్తాం..పోలీసులు రాయరు..అంటూ సమాధానాలు చెబుతారు.అలాగే బాధితుడు రాసిన ఫిర్యాదును యథాతదంగా తీసుకోక తమకు అనుకూలంగా మలుచుకొని ఫిర్యాదు తీసుకోవడం జరుగుతుంది. సమాచారాన్ని ఇచ్చే వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేసే ముందు ఫిర్యాదులో తప్పు ఒప్పులను చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. చదవడం, రాయడం రానివారు తమ ఎడమ చేతి బొటన వేలి ముద్రను సంతకం చేయాల్సిన స్థానంలో వేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దాని నకలును పోలీసులను అడిగి తీసుకోండి. దీని కోసం ఎలాంటి రుసుం చెల్లించికుండా కాపీ తీసుకునే హక్కు ఫిర్యాదు దారునికి ఉంటుంది.
ఎవరు ఫైల్ చేయాలంటే..
సంఘటన మూలంగా నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేయాలి. వారు అందుబాటులో లేని పక్షంలో వారి తాలూకూ కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. నేరం ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. నేరం జరగడానికి గల కారణాలు తెలిసిన వ్యక్తులు, ఇలాంటి సందర్భాల్లో సమాచారం ఎలా తెలిసిందో పేర్కొంటూ ఫిర్యాదుదారుడు ఎఫ్‌ఐఆర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. నేరం జరిగినపుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తే..
మీ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించిన అధికారి పేర ఫిర్యాదు జత చేసి జిల్లా ఎస్పీకి పంపాలి. ఇలా పంపేందుకు కొరియర్‌లో కాకుండా రిజిస్టర్ పోస్టులో పంపితే ఫిర్యాదు అందిన తర్వాత మీకు అక్‌నాలెడ్జ్‌మెంట్ కార్డు రావడం వల్ల ఫిర్యాదు చేరిందన్న నమ్మకం కలుగుతుంది. మీరు స్వయంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను గానీ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదును వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఉన్నతాధికారులు మీ ఫిర్యాదును నమ్మినైట్లెతే వారే స్వయంగా కేసును పరిశోధించడం గానీ, లేదా కేసులో పరిశోధన జరిగేలా కింది స్థాయి అధికారులను ఆదేశించవచ్చు. జరిగిన నేరం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ వ్యక్తిగతంగా మీరు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. పోలీసులు మీ ఫిర్యాదు విషయంలో ఏ కారణాల వల్లనైనా నిర్లక్ష్యం చేస్తే మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర శాఖకు, జాతీయ శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. నేర శిక్షాస్మృతి సెక్షన్ 161 ప్రకారం మీ స్టేట్‌మెంట్‌ను పోలీసులు తప్పని సరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదును నమోదు చేసుకున్న తర్వాత కేసులో పరిశోధన జరగకపోతే జరగకపోవడానికి గల కారణాలను పోలీసులు తప్పని సరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. నేర శిక్షాస్మృతిలోని 1973లోని సెక్షన్ 157 ప్రకారం ఫిర్యాదుదారులకు పోలీసులు కేసులో పరిశోధన జరపకపోవడానికి గల కారణాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఎఫ్‌ఐఆర్‌లో ఉండాల్సిన వివరాలు..
మీ పేరు.. చిరునామా, బాధితుల సమాచారం, ఫిర్యాదు చేయడానికి మీకు ఉన్న హోదా, లేదా అధికారం, సంఘటనకు సంబంధించిన సమయం, రోజు, స్థలం లాంటి వివరాలు. నేరం ఎలా జరిగింది.. ఎందుకు చేశారు లాంటి పక్కా సమాచారం. నేరంలో పాల్గొన్న వ్యక్తుల పేర్లు, ఒకవేళ తెలిస్తే, లేకపోతే వారిని గుర్తించడానికి వీలైన పోలికలు, దొంగతనం లాంటి కేసుల్లో వీలైతే పోయిన వస్తువుల విలువ, వాటి వివరాలు నేరస్తులు సంఘటనకు సంబంధించి వదిలి వెళ్లిన ఆధారాలు ఉంటే అవి, సంఘటనలో మీరు గాయపడితే మీరు దవాఖానలో చికిత్స తీసుకున్నారో అక్కడి మెడికల్ సర్టిఫికెట్ జత చేయాలి.
చేయ కూడనవి..
తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల భారతీయ శిక్షాస్మృతి 1860 ప్రకారం సెక్షన్ 203 కింద పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను శిక్షపడే అవకాశం ఉంది. నేరానికి సంబంధించిన సమాచారాన్ని దాచడం, నిజాలను పక్కదారి పట్టించడం, ఆధారాలను నాశనం చేయడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు దోషులుగా గుర్తించబడుతారు. నేరానికి సంబంధించిన అసంపూర్ణమైన, అస్పష్టమైన సమాచారం ఇవ్వకూడదు.
రాత పూర్వకంగానే ఇవ్వాలి..
ఫిర్యాదు రాతపూర్వకంగా గాని, మౌఖికంగా గానీ ఇవ్వవచ్చు. ఫోన్ ద్వారా అందించిన సమాచారాన్ని కూడా ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించబడుతుంది. క్రిమినల్ కోడ్ సెక్షన్ 154 ప్రకారం ఎఫ్‌ఐఆర్ రాతపూర్వకంగానే ఉండాలన్న నిబంధన లేదు. మౌఖికంగా చెప్పిన సమాచారాన్ని పోలీసులు రాసుకోవాలి. తర్వాత సమాచారం అందించిన వ్యక్తికి చదివి వినిపించి వారి సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకంగానే ఫిర్యాదు ఇవ్వాలన్న డిమాండ్ చేసే అధికారం పోలీసులకు లేదు
నేరం జరిగిన తర్వాత
ఎంత కాలంలో ఫిర్యాదు చేయాలి..
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. కాని ఫిర్యాదు ఆలస్యమైన కొద్దీ కేసులో సాక్షాధారాలు బలహీనపడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు నేరం జరిగిన కొన్ని గంటల్లోపే ఫిర్యాదు నమోదు చేయండి.
ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత..
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు కేసుకు సంబంధించిన పరిశోధన మొదలు పెడతారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రోజు నుంచి 90 రోజు లోగా చార్జిషీట్ నింపాలి. ఆరు నెలల్లో విచారణ ప్రారంభించాల్సి ఉంటుంది. ఆరు నెలల తర్వాత కేసులో విచారణ మందకోడిగా సాగుతుందనిపిస్తే మీరు జిల్లా కోర్టులో కేసు వేయవచ్చు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆరు నెలలకు సైతం చార్జిషీట్ వేయకపోతే జిల్లా ఎస్పీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మీరు రాతపూర్వకంగా విన్నవించవచ్చు.
ఎఫ్‌ఐఆర్‌ను మార్చవచ్చా..!
చార్జ్‌షీట్‌ను నింపకముందు ఏ సమయంలోనైనా ఎఫ్‌ఐఆర్‌ను మార్చడానికి వీలవుతుంది. కేసుల తీవ్రతను బట్టి తగ్గించడానికి వీల్లేదు. కానీ కేసును బలంగా తయారు చేయడానికి కొత్త సెక్షన్‌లను కలుపడానికి వీలవుతుంది.
No comments:
Post a Comment