Friday, 14 September 2018

పార్కింగ్ ఫీజు వసూలు చేసిన థియేటర్ యాజమాన్యం కి భారీ జరిమానా

థియేటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నందుకు ఓ వినియోగదారుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ మేరకు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి సదరు నిర్వాహకులకు జరిమానా విధించారు. నగరానికి చెందిన విజయ్‌గోపాల్‌ గతేడాది జూలైలో మహేశ్వరి పరమేశ్వరి సినిమా థియేటర్‌లో సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్లాడు. అనంతరం అక్కడ కారును పార్క్‌ చేశాడు. అయితే పార్కింగ్‌ సమయంలో స్టాండ్‌ నిర్వాహకులు అతడి నుంచి రూ.30 ఫీజు వసూలు చేశారు. ఇదేమని అడిగితే సదరు నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో మనస్థాపానికి గురైన విజయ్‌గోపాల్‌ ఈ ఏడాది జనవరిలో కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం-3లో ఫిర్యాదు చేశారు.
    దీనిపై సదరు నిర్వాహకులు సమాధానమిస్తూ థియేటర్‌ కాంప్లెక్స్‌ పరిధిలో పార్కింగ్‌ ఫీజు లేకుంటే అందరూ వచ్చి తమ వాహనాలను ఇక్కడే నిలుపుతున్నారని, తద్వారా సందర్శకులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. విచ్చలవిడిగా వాహనాలను పార్క్‌ చేస్తున్న వారిని అరికట్టేందుకే ఫీజు వసూలు చేస్తున్నామని తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాగా, సినిమా థియేటర్‌లో, షాపింగ్‌ కాంప్లెక్స్‌లోగాని ఏదేని వస్తువును కొనుగోలు చేసినట్లుగా, సినిమా చూసినట్లుగా బిల్లు చూపిస్తే పార్కింగ్‌ ఫీజు వాపసు చేయాలని నిబంధనలున్నాయి. అయితే విజయ్‌గోపాల్‌ థియేటర్‌లో సినిమా చూసినప్పటికీ అతడి నుంచి పార్కింగ్‌ వసూలు చేయడం అక్రమమనిజడ్జి పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్‌గోపాల్‌ను మానసిక క్షోభకు గురిచేసినందుకు థియేటర్‌ నిర్వాహకులకు రూ.50,000, కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని తీర్పు చెప్పారు.

No comments:

Post a Comment