Friday, 11 May 2018

ఈ నెల 30 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 30 నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతనాల పెంపునకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 5న బ్యాంకు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సందర్భంగా ఉద్యోగుల వేతనాలను 2 శాతం మేర పెంచేందుకు ఐబిఎ ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐబిఎ చేసిన ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కావని యునైటెడ్‌ ఫోరమ్‌ ఫర్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) తెలిపింది.

గతంలో చివరిసారిగా చేసిన వేతన సవరణలో 15 శాతం ఇంక్రిమెంట్‌ ఇచ్చేందుకు సమ్మతించిన ఐబిఎ ఇప్పుడు కంటి తుడుపు చర్యగా కేవలం 2 శాతం పెంపును ప్రకటించటం అన్యాయమైన విష యమని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (ఎఐబిఈ) జాతీయ కార్యదర్శి సిహెచ్‌ వెంకటాచలం అన్నారు. ద్రవ్యోల్బణ పరిస్థితులకు తగ్గట్టుగా వేతనాలను పెంచాల్సి ఉన్నప్పటికీ ఐబిఎ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఎఐబిఒసి) సంయుక్త కార్యదర్శి రవీంద్ర గుప్తా పేర్కొన్నారు. వేతన పెంపునకు సంబంధించి ప్రభుత్వం, ఐబిఎ వ్యవహరిస్తున్న తీరు ను నిరసిస్తూ ఈ నెల 30 నుంచి రెండు రోజుల పాటు ఎఐబిఒసి, ఎఐబిఈ సహా మొత్తం 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి.

No comments:

Post a Comment