Friday, 11 May 2018

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ: కలెక్టర్‌

హైదరాబాద్‌ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్‌ యోగితారాణా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కలెక్టర్‌ పలు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 18 వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 702 మంది మైనార్టీ, 625 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ప్రస్తుతం 512 మంది శిక్షణ పొందుతున్నారు. ఒక్కో కోర్సులో 2 నుంచి 6 నెలల వరకు వసతి సదుపాయంతో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈసీఐఎల్‌, అలివ్‌ సెట్విన్‌, ఏస్‌, డైలాగ్‌ ఇన్‌ ద డార్క్‌, క్యాబ్‌ ఫౌండేషన్‌, సీపెట్‌, నాన్‌వాస్కో టెక్నాలజీ, టీఎస్‌ ఆర్టీసీ సంస్థ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ కోసం అవగాహన ఒప్పందాలను జిల్లా అధికారులు చేసుకున్నారు. రియాసత్‌నగర్‌లో ట్యాలీ, జీఎస్టీ, డీటీపీ, డిజైనింగ్‌ కోర్సులలో, అమీర్‌పేటలో డీటీపీ, నెట్‌ వర్కింగ్‌, హార్డ్‌వేర్‌లో శిక్షణ ఇస్తున్నారు. నషేమాన్‌నగర్‌, హేజ్‌బాబానగర్‌, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌లలో టైలరింగ్‌, విద్యానగర్‌, మీరాలం ట్యాంక్‌, బహదూర్‌పురాలో ఏసీ రిపేరింగ్‌, మొబైల్‌ సర్వీసింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు.

క్యాబ్‌ ఫౌండేషన్‌, డాన్‌ బాస్కో టెక్నాలజీల సహకారంతో కోఠి, దూద్‌బౌలి, బండ్లగూడ, గాగిల్లాపురం, రామంతాపూర్‌లో హాస్పిటాలిటీ, బెడ్‌ సైడ్‌ నర్సింగ్‌, రిటైల్‌ మార్కెటింగ్‌, ఎలక్ర్టికల్‌, వెల్డింగ్‌, ఏసీ సర్వీసింగ్‌ తదితర 70 ట్రేడ్‌లలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. 10వ తరగతిలోపు విద్యార్హత ఉన్న అభ్యర్థులకు టీఎస్‌ ఆర్టీసీ ద్వారా హకీంపేటలో లైట్‌మోటర్‌ వెహికిల్‌, హెవీ మోటర్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌లో శిక్షణను 3 నెలల పాటు ఇస్తున్నారు. అంధ అభ్యర్థులకు పసుమాముల పెద్దఅంబర్‌పేట్‌లో లైఫ్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఈ సంవత్సరం 700 మందికి ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ ఎంత మంది దరఖాస్తు చేసుకున్నా వారికి శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు నిధుల కొరత లేదని వారు పేర్కొంటున్నారు.

శిక్షణ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఖాసీం జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (8639787489), డి.హన్మంత్‌నాయక్‌ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌ (9489905999), సావిత్రి, ప్రోగ్రామింగ్‌ అధికారి ఈసీఐఎల్‌ (9985798828), మాధవి ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ అలీప్‌ (9849802970), బీఎన్‌.చారి ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ సెట్విన్‌ (9866653908)ను సంప్రదించాలని కలెక్టర్‌ యోగితారాణా సూచించారు. సత్య, ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ ఏసీఈ (9440804858), నర్సింగరావు, ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ పాలిటెక్నిక్‌(9912342001, మాధవి ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ క్యాప్‌ ఫౌండేషన్‌ (8798969698), రవికుమార్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ సీఐపీఈటీ (9959333415), డాన్‌ బాస్కోటెక్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ (9900546572), రాజశేఖర్‌ టీఎస్‌ ఆర్టీసీ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ (73828 10023), ఏ సుధాకర్‌ టీఎస్‌ ఆర్టీసీ ప్రోగామ్రింగ్‌ ఆఫీసర్‌ (7382800936)ను సంప్రదించాలని ఆమె సూచించారు

No comments:

Post a Comment