Thursday, 10 May 2018

పవన్ కి అండగా జే(జనసేన) న్యూస్ చానెల్

జనసేన నిర్ణయం మార్చుకుంది. జనసేనాని మనసు మారింది. అనేక సందేహాలు వచ్చినా చివరకు ఓ నిర్ణయానికి వచ్చేశారు. సొంత మీడియా ఏర్పాటు విషయంలో క్లారిటీకి వచ్చేశారు. త్వరలోనే పాత చానెల్ పేరు మార్చుకుని జనసేన రాగం అందుకోబోతోంది. కమ్యూనిస్టుల సారధ్యంలో మొదలయ్యి, అనేకమంది చేతులు మారిన తర్వాత చివరకు పవన్ గూటి టీవీ చానెల్ గా రూపాంతరం చెందడం ఖాయం అయ్యింది. త్వరోలనే 99న్యూస్ చానెల్ పూర్తిగా జే న్యూస్ అనే పేరుతో కనిపించబోతోందని సమాచారం.

99 న్యూస్ చానెల్ ను టేకోవర్ చేయడం పై జనసేన పార్టీలో తీవ్ర చర్చలు సాగాయి. లాభనష్టాలపై అనేక రకాలుగా బేరీజు వేశారు. ముఖ్యంగా చానెల్ కార్యాలయం నగర శివార్లలో ఉండడం పెద్ద మైనస్ గా భావించారు. అయితే కొత్త చానెల్ ద్వారా జనంలోకి వెళ్లడానికి సమయం పడుతుంది కాబట్టి, ఎన్నికలకు గడువు తక్కువగా ఉన్నందున ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పాత చానెల్ నే పేరు మార్చి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చేశారు.

ఇప్పటికే సురవరం సుధాకర్ రెడ్డి తనయుడు కొంత కాలం పాటు సారధ్యం వహించిన ఈ చానెల్ కు ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ వంటి అనేక మంది బాసులుగా పనిచేశారు. కానీ చానెల్ ప్రభావం చూపలేకపోయింది. ఇక చివరకు అనివార్యంగా కమ్యూనిస్టులు తమ టీవీని జనసేనకు అప్పగిస్తుండగా, పవన్ తరుపున విజయవాడకు చెందిన ఓ నాయకుడు చానెల్ నిర్వహణా బాధ్యతా నెత్తికెత్తుకున్నారు. చానెల్ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి పలువురు పాత్రికేయుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇన్నాళ్లుగా తమ గొంతు వినిపించే మీడియా చానెల్ లేదని, వాపోయిన జనసైనికులు ఇకపై ఆ బెంగ తీరబోతోంది. ఈనెలలోనే ప్రజల్లోకి యాత్రల పేరుతో అడుగుపెడుతున్న పవన్ కి అండగా చానెల్ సిద్ధం అవుతోందని సమాచారం.

No comments:

Post a Comment